పెళ్లి వేడుకపై ప్రకృతి ప్రకోపం.. నిమిషాల్లో భారీ వేదికను కూల్చేసిన పెనుగాలి.. వీడియో ఇదిగో!

  • రాజస్థాన్‌లోని టోంక్‌లో 36 జంటల సామూహిక వివాహ వేడుక
  • వేడుకపై విరుచుకుపడిన భీకర దుమ్ము తుపాను, భారీ వర్షం
  • పెనుగాలికి పెళ్లి పందిళ్లు కూలి వేదిక పూర్తిగా ధ్వంసం
  • టెంట్ పైపులు మీద పడటంతో పలువురు మహిళలు, పిల్లలకు గాయాలు
రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలో ఘనంగా జరుగుతున్న ఓ సామూహిక వివాహ వేడుకలో అపశ్రుతి చోటుచేసుకుంది. 36 జంటల పెళ్లి కోసం ఏర్పాటు చేసిన వేదికను ఓ భీకర దుమ్ము తుపాను నిమిషాల్లోనే ఛిన్నాభిన్నం చేసింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

ధాకడ్ కమ్యూనిటీకి చెందిన 36 జంటల కోసం ఓ బహిరంగ మైదానంలో సామూహిక వివాహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి సందడిగా ఉన్న ఆ ప్రాంతంలో మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన గాలులు కాస్తా భయానక సుడిగాలిగా మారి వేదికపై విరుచుకుపడింది.

ఈ పెనుగాలి ధాటికి వేదిక కోసం వేసిన టెంట్లు గాల్లోకి లేచిపోయాయి. పెళ్లికూతురు, పెళ్లికొడుకు కోసం తెచ్చిన వస్తువులు, ఇతర సామాగ్రి సమీపంలోని పొలాల్లోకి చెల్లాచెదురుగా కొట్టుకుపోయాయి. ప్రాణభయంతో జనం పరుగులు తీశారు. ఈ క్రమంలో టెంట్ల ఇనుప పైపులు మీద పడటంతో పలువురు మహిళలు, పిల్లలకు గాయాలయ్యాయి. దుమ్ము తుపాను అనంతరం భారీ వర్షం కురవడంతో పెళ్లి సందడి కాస్తా ఆందోళనకరంగా మారింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిన రాజస్థాన్ ఇంధన శాఖ మంత్రి హీరాలాల్ నగర్, వర్షం తగ్గిన తర్వాత అక్కడికి చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదించారు. పశ్చిమ అలజడుల కారణంగా రాజస్థాన్‌లో ఇటీవల వాతావరణం అసాధారణంగా ఉంటోందని, రానున్న రోజుల్లో మరిన్ని దుమ్ము తుపానులు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Wedding Ceremony
Rajasthan
Strong Wind
Marriages Tonk
National News
Offbeat News

More Telugu News